nobel: ఆర్థిక నోబెల్ రేసులో రఘురాం రాజన్!
- ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన 'వాల్ స్ట్రీట్ జర్నల్'
- పోటీలో మరో ఐదుగురి పేర్లు కూడా
- అవార్డు ప్రాబబుల్స్ లో ఆరుగురి పేర్లు ప్రకటించిన క్లారివేట్
- ప్రస్తుతం షికాగో వర్శిటీ ప్రొఫెసర్ గా ఉన్న రాజన్
ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ప్రముఖ ఎకానమిస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేరు రేసులో ఉన్నట్టు 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. క్లారివేట్ అనలిటిక్స్ అధ్యయనం చేసి విడుదల చేసిన జాబితాలో నోబెల్ జాబితా రేసులో రఘురాం రాజన్ తో పాటు మరో ఐదుగురు ఉన్నారని తెలిపింది.
గత 15 సంవత్సరాలుగా క్లారివెట్ ఎంపిక చేసిన 45 మందికి నోబెల్ పురస్కారాలు వచ్చాయి. ఒక సంవత్సరం అయితే ఏకంగా క్లారివెట్ జాబితాలో 9 మంది నోబెల్ అందుకున్నారు. భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగంలో విశేష కృషి చేసినవారికి ఏటా నోబెల్ పురస్కారాలు అందిస్తారన్న సంగతి తెలిసిందే.
2017 సంవత్సరానికిగాను, ఇప్పటికే ఐదు రంగాల్లో అవార్డులు ప్రకటించగా, 9వ తేదీ సోమవారం నాడు స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఎవరికి దక్కనుందన్న విషయాన్ని నోబెల్ కమిటీ వెల్లడించనుంది. ప్రస్తుతం రఘురాం రాజన్ అమెరికాలోని షికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, రాజన్ కు కచ్ఛితంగా ఆర్థిక నోబెల్ దక్కుతుందని చెప్పలేకపోయినా, ఆయన పేరు కూడా ప్రాబబుల్స్ జాబితాలో ఉండటంతో యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాజన్ తో పాటు పోటీలో ఉన్న వారిలో బిహేవియరల్ ఎకనామిక్స్, న్యూరో ఎకనామిక్స్ లో విశ్లేషణలు చేసిన జార్జ్ లోవెన్ స్టియన్, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ కు చెందిన విశ్లేషకుడు కోలిన్ కామెరర్, వర్కర్ ప్రొడక్టివిటీ, నిరుద్యోగ సమస్యకు కారణాలపై అధ్యయనాలు చేసిన స్టాన్ ఫోర్డ్ వర్శిటీ అనలిస్టు రాబర్ట్ హాల్, హార్వార్డ్ కు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ జన్ సేన్, ఎంఐటీకి చెందిన స్టీవార్ట్ మేయర్స్ పేర్లను కూడా క్లారివేట్ అనలిటిక్స్ ప్రకటించింది.
40 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ ద్రవ్య నిధికి చీఫ్ ఎకానమిస్ట్ గా పని చేసిన రాజన్, ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందని, అమెరికన్ బ్యాంకులు దివాలా తీయనున్నాయని 2005లోనే అంచనా వేయగా, అది 2008లో జరిగింది. ఆపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పని చేస్తూ, దారి తప్పుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు, డాలర్ తో రూపాయి మారకపు విలువ మరింతగా దిగజారకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.