FIFA U-17 World Cup: పిఫా ప్రపంచకప్‌లో అభిమానులకు చేదు అనుభవం.. నీళ్లు లేక టాయిలెట్‌లోని వాటర్‌ను తాగిన అభిమానులు

  • తొలి రోజే విద్యార్థులకు చేదు అనుభవం
  • స్టేడియంలో కొట్టొచ్చినట్టు కనిపించిన నిర్వహణ లోపం
  • అంగీకరించిన స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ

భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 వరల్డ్‌ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశ మిగిలింది. పోటీలు జరుగుతున్న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. చేసేది లేక టాయిలెట్‌లోని నీళ్లను తాగి గొంతు తడుపుకున్నారు.

దేశంలో తొలిసారి జరుగుతున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రభుత్వం మొత్తం 27వేల టికెట్లు, టీషర్టులు, టోపీలను విద్యార్థులకు పంపిణీ చేసింది. ప్రధానమంత్రి మోదీ ఈ మ్యాచ్ చూసేందుకు రావడంతో స్టేడియం ఖాళీగా కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భారీగా స్టేడియానికి రప్పించారు.

అయితే నిర్వహణ లోపంతో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు ఏ మూలకు సరిపోకపోవడంతో వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నీటితో దాహం తీర్చుకున్నారు. అలాగే విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఆహార పదార్థాలు కూడా చాలా ఆలస్యంగా స్టేడియంలోకి చేరుకున్నాయి. దీంతో మ్యాచ్ రెండో సగం తర్వాత వాటిని పంపిణీ చేశారు. ఇక స్టేడియంలో డస్ట్‌బిన్‌లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. సరిపడా నీళ్ల  సీసాలు అందుబాటులో ఉంచడంలో వైఫల్యం చెందినట్టు స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News