pixel 2: పిక్సెల్ 2 ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ లోపించడంపై సమాధానం చెప్పిన గూగుల్
- ఆపిల్‌ను అనుకరించిందని ఆరోపణలు
- సాంకేతిక ప్రమాణాల అమలు కోసమని సంజాయిషీ
- ప్రత్యేక అడాప్టర్ తయారుచేసే ఉద్దేశం
గతేడాది ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించడంపై ఆపిల్ సంస్థను గూగుల్ ఎద్దేవా చేసింది. అలాంటిది గూగుల్ అక్టోబర్ 4న విడుదల చేసిన తమ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ఫోన్లను హెడ్‌ఫోన్ జాక్ లేకుండా విడుదల చేసింది. ఈ విషయాన్ని పిక్సెల్ ఆవిష్కరణ సమయంలో వెల్లడించలేదు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన వారు హెడ్‌ఫోన్ జాక్ లేని విషయాన్ని గుర్తించారు. దీనిపై గ్యాడ్జెట్ గురులు మండిపడ్డారు.
ఆపిల్‌ను అనుకరించిందంటూ కామెంట్లు చేశారు. ఒకప్పుడు ఎద్దేవా చేసి ఇప్పుడు దానిని అనుకరించడం ఎందుకని నిలదీశారు. దీనికి గూగుల్ సమాధానం చెప్పింది. `పిక్సెల్ 2కి హెడ్‌ఫోన్ సౌకర్యం ఉంది. కాకపోతే హెడ్‌సెట్‌ని కూడా యూఎస్బీ పోర్ట్‌లోనే కనెక్ట్ చేసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రమాణాలను అమలు చేయడానికే ఈ మార్పు తీసుకువచ్చాం` అని తెలిపింది.
పిక్సెల్ ఫోన్లలో యూఎస్బీ కనెక్టబిలిటీని సపోర్ట్ చేసే హెడ్ఫోన్ల జాబితాను కూడా గూగుల్ ప్రకటించింది. అంతేకాకుండా మామూలు హెడ్ఫోన్లను, యూఎస్బీ కనెక్టబిలిటీ హెడ్ఫోన్లుగా మార్చే ప్రత్యేక అడాప్టర్‌ని కూడా తయారు చేసే యోచనలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది.