oscar: ఆస్కార్ కోసం... 91 సినిమాలతో పోటీ పడుతున్న భారతీయ సినిమా!
- ఆస్కార్ బరిలో ఉన్న `న్యూటన్`
- ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 92 చిత్రాలు
- నామినేట్ అయిన చిత్రాలను జనవరి 23, 2018న ప్రకటిస్తారు
90వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి వివిధ దేశాల నుంచి మొత్తం 92 చిత్రాలు వచ్చాయి. వీటిలో భారత్ నుంచి ఎంపికైన `న్యూటన్` సినిమా కూడా ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవాలంటే `న్యూటన్` చిత్రం మిగతా 91 చిత్రాలతో పోటీపడాల్సి ఉంది. హైతీ, హోండూరస్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మొజాంబిక్, సెనగల్, సిరియా దేశాలు మొదటిసారిగా ఈ కేటగిరీలో పోటీపడుతున్నాయి.
ఈ 91 చిత్రాల్లో ఏంజెలీనా జోలీ నటించిన కాంబోడియా చిత్రం `ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్` సినిమా కూడా ఉంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరున్న దిగ్గజ నటులు నటించిన చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాజ్‌కుమార్ రావ్ నటించిన `న్యూటన్` చిత్రానికి అమిత్ వి. మసుర్కర్ దర్శకత్వం వహించారు. ఎన్నికల కథాంశం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 14 మంది సభ్యుల ఆస్కార్ జ్యూరీ కమిటీ 2018 ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేసింది. నామినేషన్లకు ఎంపికైన చిత్రాల వివరాలను జనవరి 23, 2018న ఆస్కార్ వెల్లడించనుంది. అలాగే 2018, మార్చి 4న అవార్డులను అందజేయనుంది.