america: అమెరికాకు ముంచుకొస్తున్న మరో తుపాను ముప్పు!
- దూసుకొస్తున్న నేట్ తుపాను
- లూసియానాలో ఎమర్జెన్సీ
- 50 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసే అవకాశం
ఇప్పటికే హార్వే, ఇర్మా హరికేన్ ల దెబ్బకు అమెరికా వణికిపోయింది. తాజాగా మరో పెను ప్రమాదం అమెరికాను భయపెడుతోంది. సెంట్రల్ అమెరికాను బెంబేలెత్తించిన నేట్ తుపాను అమెరికా తీరం దిశగా దూసుకొస్తోంది. ఆదివారం నాటికి ఇది బలపడి, లూసియానాలోని న్యూఓర్లేన్స్ వద్ద తీరం దాటనుంది. ఆ సమయంలో 38 నుంచి 50 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురియనుందట. ఇదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లూసియానా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు.
సెంట్రల్ అమెరికాలో నేట్ తుపాను బీభత్సం సృష్టించింది. సమాచార, రవాణా వ్యవస్థలు నాశనం అయ్యాయి. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 22 మంది ప్రాణాలను కోల్పోగా, మరో 15 మంది గల్లంతయ్యారు.