Honeypreet: పంచకులలో అల్లర్ల కోసం రూ.1.25 కోట్లు ఇచ్చిన హనీప్రీత్.. వెల్లడించిన పోలీసులు
- గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడి విచారణలో వెలుగుచూసిన నిజం
- అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన పోలీసులు
- గుర్మీత్ ఆదేశాల ప్రకారమే హనీప్రీత్ వెంట సుక్దీప్ కౌర్
సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషిగా తేలిన తర్వాత అల్లర్లు రేకెత్తించేందుకు డేరా సచ్చా సౌధా పంచకుల బ్రాంచ్ హెడ్ చామ్‌కౌర్ సింగ్‌కు హనీప్రీత్ సింగ్ రూ.1.25 కోట్లు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ అయిన రాకేశ్ కుమార్ ను విచారించడంతో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
రేప్ కేసులో గుర్మీత్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత అల్లర్లు రేపేందుకే ఈ మొత్తాన్ని ముట్టజెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రాకేశ్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో ఉన్నాడు. పంచకులలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచకుల డేరా హెడ్ చామ్‌కౌర్‌కు హనీప్రీత్ రూ.1.25 కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్న పంచకుల కమిషనర్ ఏఎస్ చావ్లా అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
అక్టోబరు 3న హనీప్రీత్‌తోపాటు అరెస్టయిన సుక్దీప్ కౌర్ భర్త ఇక్బాల్ సింగ్ కూడా డేరా కోర్ గ్రూప్‌లో ముఖ్య సభ్యుడని పోలీసులు వివరించారు. డేరా ప్రాంగణంలో ఆయుధాల నిర్వహణ మొత్తం ఆయనే చూసుకునేవాడని తెలిపారు. సునారియా జైలులో ఉంటున్న గుర్మీత్ వద్దకు సుక్దీప్ను తీసుకెళ్లింది ఇక్బాలేనని, గుర్మీత్ ఆదేశాల ప్రకారమే ఆమె హనీప్రీత్‌తో ఉందని పేర్కొన్నారు.