cricket: ఐసీసీ కొత్త రూల్స్ తరువాత తొలి శిక్షపడేది ధోనీకేనట!
- ఫేక్ ఫీల్డింగ్ పై ఐసీసీ కొత్త నిబంధనలు
- హద్దు మీరితే శిక్ష తప్పదు
- చేతిలో బంతి లేకున్నా, వికెట్ల వైపు చేతులు పంపే ధోనీ
- అది కూడా నిబంధనల ప్రకారం ఫేక్ ఫీల్డింగే
- ఐసీసీ వైఖరిని ప్రశ్నించిన సంజయ్ మంజ్రేకర్
క్రికెట్ లో నిబంధనలను మరింత కఠినం చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుని, వాటిని పక్కాగా అమలు చేస్తుండగా, ఇండియాలో తొలి శిక్ష మహేంద్ర సింగ్ ధోనీకే పడుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఫేక్ ఫీల్డింగ్ నిబంధనలు ధోనీని శిక్షకు గురి చేస్తాయని అంటున్నారు. సాధారణంగా కీపింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న వేళ, దూరం నుంచి వచ్చే బంతిని ధోనీ, తన చేతులతో అడ్డుకుని, వికెట్లపైకి నెడతాడన్న సంగతి తెలిసిందే. బంతిని క్యాచ్ పట్టుకుని, వికెట్లను గిరాటు వేయకుండా, బంతి దారిని వికెట్లపైకి మళ్లించడంలో ధోనీ ఎంతటి దిట్టో అందరికీ అనుభవమే.
ఇక కొత్త నిబంధనల ప్రకారం, ధోనీ అలాంటి బంతిని అందుకోవడంలో విఫలమై, ఖాళీ చేతులను వికెట్లవైపు చూపిస్తే, శిక్ష ఖాయం. అది ఫేక్ ఫీల్డింగ్ కిందకే వస్తుంది. గత నెల 28 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రాగా, ఆ మరుసటి రోజే క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ఓ క్రికెటర్, బంతి చేతిలో లేకున్నా, దాన్ని విసిరేస్తున్నట్టు యాక్ట్ చేయగా, ఆ జట్టుపై 5 పరుగుల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే నిబంధనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఐసీసీపై నిప్పులు చెరిగాడు. తన సోషల్ మీడియా ఖాతాల్లో పలు పోస్టులు పెడుతూ, ఈ నిబంధనను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశాడు. బ్యాట్స్ మెన్ ను తప్పుదారి పట్టించినందుకు పెనాల్టీ విధిస్తున్న ఐసీసీ, బౌలర్లను తప్పుదారి పట్టించే ఆటగాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ఫేక్ ఫీల్డింగ్ మోసం కాదని, అదో ట్రిక్కని చెబుతూ, దీన్ని తొలగించాలని కోరాడు.