Pakistan: అవును! ఉగ్రవాదులతో ఐఎస్ఐకి సంబంధాలున్నాయి.. ఎట్టకేలకు అంగీకరించిన పాక్
- సంబంధాలున్నంత మాత్రాన ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్టు కాదు
- అలా సంబంధాలు లేని ఇంటెలిజెన్స్ ఏజెన్సీని చూపించాలని సవాలు
- అమెరికా కూడా అదే చెప్పింది
- భారత్‌తో యుద్ధం చేయగలిగే సత్తా తమకుందన్న పాక్ ఆర్మీ
పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి ఉగ్రవాదులతో సంబంధాలున్న మాట వాస్తవమేనని పాకిస్థాన్ మిలటరీ స్పష్టం చేసింది. అయితే అంతమాత్రాన తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్టు కాదని తేల్చి చెప్పింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్-ఉద్-దవా ఇటీవల ప్రారంభించిన రాజకీయ పార్టీ ‘మిల్లి ముస్లిం లీగ్’ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించినట్టు తెలిపింది.
ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి మధ్య సంబంధాలున్నాయన్న అమెరికా ఆరోపణలపై స్పందించిన ఐఎస్ఐ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మజ్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలుండడం వేరు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వేరని అన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు లేని ఇంటెలిజెన్స్ ఏజెన్సీని చూపించాలని సవాలు విసిరారు. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కూడా సంబంధాలున్నాయనే అన్నారు తప్పితే మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదన్నారు.
తమది శాంతికాముక దేశమని పేర్కొన్న గఫూర్ పొరుగుదేశం భారత్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. అయితే యుద్ధం చేయగలిగే సత్తా మాత్రం తమకు ఉందని నొక్కి చెప్పారు. సమస్యకు యుద్ధం ఎంతమాత్రమూ పరిష్కారం కాదన్నారు. కాబట్టి చర్చల ద్వారానే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.