Delhi: జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కుదరవు.. ఖాళీ చేయించండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం
- జంతర్ మంతర్ ను ఖాళీ చేయించి రామ్ లీలా మైదాన్ కు తరలించండి
- జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రీన్ ట్రైబ్యునల్ లో ఫిర్యాదు
- ఇబ్బందులు నిజమేనని నిర్ధారించి, జంతర్ మంతర్ తరలించాలని ఆదేశం
అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేయాలన్నా, ప్రభుత్వాల తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయాలన్నా, ఏ పోరాటం చేయాలన్నా దేశ రాజధాని వాసులకు గుర్తొచ్చే ప్రాంతం జంతర్ మంతర్. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ఎన్జీవోలు, రైతులు ఇలా వివిధ వర్గాలు చేసే ఎన్నో పోరాటాలకు వేదికైన జంతర్ మంతర్ ను ఖాళీ చేసి రాంలీలా మైదాన్ కు తరలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తక్షణమే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న అన్ని ఆందోళనలు, నిరసనలను ఆపేసి, లౌడ్ స్పీకర్లు తొలగించాలని తేల్చిచెప్పింది. ఈ లౌడ్ స్పీకర్ల వల్ల అక్కడ నివాసం ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వరుణ్ సేథ్ అనే వ్యక్తి గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ ఆర్‌ఎస్.రాథోడ్, పిటిషన్ లోని అంశాలు వాస్తవమని నిర్ధారించి, జంతర్ మంతర్ ను ఖాళీ చేయాలని స్పష్టమైన ఆదేశాలను ఎన్‌డీఎంసీ (దిల్లీ మున్సిపల్ కౌన్సిల్) అధికారులకు జారీ చేశారు.