Saudi Arabia: సౌదీ రాజుకు రష్యాలో చేదు అనుభవం.. మధ్యలోనే మొరాయించిన గోల్డెన్ ఎస్కలేటర్.. విమానం నుంచి నడుస్తూనే కిందకు!
- వేచి చూసినా ఫలితం లేకపోవడంతో నడక ప్రారంభించిన రాజు
- రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
- బిలియన్ డాలర్ల ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ప్రారంభం
సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్ అల్‌కు రష్యాలో చేదు అనుభవం ఎదురైంది. 200 మంది ప్రతినిధులు, 85 మంది సీఈవోలు, మందీమార్బలంతో వచ్చిన ఆయన ప్రత్యేక విమానం రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం గోల్డెన్ ఎస్కలేటర్‌లో రాజు నిలబడి కిందికి దిగుతున్నారు. కొద్ది దూరం వచ్చారో లేదో ఎస్కలేటర్ పనిచేయడం మానేసింది.
అది తిరిగి పనిచేస్తుందేమోనని రాజు దాదాపు 30 సెకన్లు వేచి చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో నెమ్మదిగా మెట్లు దిగి కిందికి చేరుకున్నారు. కాగా, సౌదీ రాజు జరిపిన ఈ చారిత్రక పర్యటనలో సౌదీ, రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ రాజు మధ్య జరిగిన సమావేశం అనంతరం రెండు దేశాలు సంయుక్తంగా బిలియన్ డాలర్లతో ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను ప్రారంభించాయి.