sashikala: శశికళ పెరోల్ కు తొలగుతున్న అడ్డంకులు!
- పెరోలిస్తే అభ్యంతరం లేదన్న తమిళనాడు పోలీసులు
- జైలు అధికారులకు లేఖ
- నాలుగైదు రోజుల పెరోల్ లభించే అవకాశం
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ పెరోల్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, ఆమెకు పెరోల్ మంజూరు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ జైలు అధికారులకు తమిళనాడు పోలీసులు లేఖ రాశారు. దీంతో, ఆమె పెరోల్ కు ఓ అడ్డంకి తొలగినట్టైంది. కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే ఆమెకు పెరోల్ మంజూరయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, మరో రెండు, మూడు రోజుల్లో ఆమె జైలు నుంచి బయటకు రావచ్చు.
15 రోజుల పెరోల్ కావాలంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు నాలుగైదు రోజులు మాత్రమే పెరోల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. శశికళ భర్త లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భర్తను చూసేందుకు ఆమె పెరోల్ కు దరఖాస్తు చేసుకున్నారు.