ysrcp: వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఐదుగురు నేతలు?... మళ్లీ మొదలైన ఆపరేషన్ ఆకర్ష్
- వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ప్రారంభం కానున్న వలసలు
- తెరవెనుక మంత్రాంగం నడిపిన ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్
- కర్నూలు, అనంతపురం నుంచి ఐదుగురు కీలక నేతల జంప్?
- రెడ్డి సామాజిక వర్గమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మరోసారి భారీగా వలసలు మొదలయ్యాయి. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన అనంతరం మరోసారి టీడీపీ తెరవెనుక మంత్రాగం నడిపినట్టు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ దుకాణం ఖాళీ చేయించే దిశగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి నలుగురు కీలక వైఎస్సార్సీపీ నేతలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన కీలకమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
దీని వెనుక ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్ మంత్రాగం నడిపినట్టు సమాచారం. వైఎస్సార్సీపీకి చెందిన గుర్నాథరెడ్డి, ఎంపీ బుట్టా రేణుకలు పార్టీ మారనున్నట్టు గతంలో ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. రేపటికల్లా ఈ వలసలు ప్రారంభమై వారం రోజుల్లో ముగియనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలు ఊపందుకుంటాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు.