menak guru swami: మేధావుల సరసన చేరిన హైదరాబాద్ న్యాయవాది... కీలక సెక్షన్లు అమలు కావడానికి ఆమె కారణం
- ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని రోడ్స్‌హౌజ్ మిల్నర్ హాల్‌లో చోటు
- ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు
- విద్యాహక్కు చట్టం అమల్లో కీలక పాత్ర
మేనకా గురుస్వామి... హైదరాబాద్‌కి చెందిన ఈ నలభై రెండేళ్ల న్యాయవాది ఇప్పటివరకు ఏ భారత వ్యక్తి సాధించని ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రోడ్స్ హౌజ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండే మిల్నర్ హాల్‌లో ఆమె చోటు సంపాదించింది. దీంతో ప్రపంచ మేధావుల సరసన ఆమె స్థానం సంపాదించుకున్నట్లైంది.
మరో విషయం ఏంటంటే... ఈమె అదే విశ్వవిద్యాలయంలో రోడ్స్ హౌజ్ వారు అందజేసిన స్కాలర్‌షిప్‌తోనే చదువు పూర్తిచేసింది. ఓ న్యాయవాదిగా సమాజం కోసం ఆమె ఎంతో చేశారు. భారత్‌లో విద్యా హక్కు చట్టం అమల్లోకి రావడానికి మేనక ఎంతో పోరాడారు. అలాగే స్వలింగ సంపర్కాన్ని నిషేధించే ఐపీసీ 377 సెక్షన్‌కి వ్యతిరేకంగా పోరాటంలో, చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వమే పెంచి పోషించిన సాయుధ దళంపై సుప్రీంకోర్టులో జరిగిన పోరాటంలో ఆమె భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా విద్యార్థిగా ఉన్నప్పుడే ఐరాసకి మానవహక్కుల సలహాదారుగా మేనక పనిచేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన మేనక చదువుకునే రోజుల్లో గాయని అవ్వాలని, చదరంగం క్రీడలో రాణించాలని అనుకునేదట. కానీ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ చేరి.. బంగారుపతకం అందుకున్నాక ఆమెకు భారత అటార్నీ జనరల్ కార్యాలయంలో పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. దీంతో న్యాయవాద వృత్తిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
కొంతకాలం అక్కడ పనిచేశాక 1998లో ఆక్స్‌ఫర్డ్‌లో బీసీఎల్ కోర్సులో చేశారు. తర్వాత హార్వర్డ్‌లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి ‘న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా’లో అధ్యాపకురాలిగా చేరారు. తర్వాత ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సలహాదారుగా కూడా పనిచేసి, భారత రాజ్యాంగ చట్టాల మీద ఆసక్తితో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు పరిష్కరించిన ఎన్నో కీలక విచారణల్లో ఆమె తనదైన వాదన వినిపించారు.