sujana forum mall: కేపీహెచ్బీ సుజనా ఫోరం మాల్ పై కేసు నమోదు.. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు!
- చట్ట విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు
- ఏపీ, తెలంగాణ అపార్ట్ మెంట్ యాక్ట్ బుట్టదాఖలు
- తార్నాకకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు
హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలోని ఫోరం సుజనా మాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏపీ, తెలంగాణ అపార్ట్ మెంట్ యాక్ట్ 1978 నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారులు, సందర్శకుల నుంచి మాల్ నిర్వాహకులు పార్కింగ్ రూపంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంపై గత నెల తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కారులో మాల్ కు వచ్చానని, తన వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు రూపంలో రూ. 50 వసూలు చేశారని ఫిర్యాదులో విజయ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955, సెక్షన్ 115(40) ప్రకారం ఏ స్థలమైనా సందర్శకులను ఆహ్వానించేందుకు నిర్దేశించబడినప్పుడు, ఆ స్థలం పబ్లిక్ ప్లేస్ గా గుర్తించబడుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో, సందర్శకుల వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని వదలాల్సి ఉంటుందని చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్ లలో 44 శాతం బిల్డప్ ఏరియాను పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. పార్కింగ్ ఏరియాను లీజుకు ఇవ్వడం, అమ్మడం నిషేధమని చెప్పారు. ఇలాంటి ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో, సుజనా చౌదరితోపాటు మరో ఆరుగురిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే, సుజనా మాల్ పై కేసు నమోదైంది.