Mumbai: ముంబై రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం.. 'ఫూల్'ను 'పూల్'గా అర్థం చేసుకోవడమేనట!
- పూల వ్యాపారి మాటలను తప్పుగా అర్థం చేసుకున్న ప్రయాణికులు
- వంతెనపై నుంచి పరుగులు
- ఫలితంగా తొక్కిసలాట.. 23 మంది మృతి
ముంబైలోని ఎల్ఫిన్ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటకు అసలు కారణం తెలిసింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఓ చిన్న పదమేనని తేలింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తోపులాటలో ఓ పూల వ్యాపారి గంపలోని పూలు కింద పడడంతో ‘ఫూల్ గిర్ గయా’ (పువ్వులు కిందపడ్డాయి) అని బిగ్గరగా కేకలు వేశాడు.
అయితే ప్రయాణికులు ఆ మాటలను పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫూల్‌కు బదులు పూల్ (వంతెన)గా భావించి అది కూలిపోతోందన్న భయంతో పరుగులు తీశారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల యువతి తెలిపింది. విచారణ అధికారులు ఆమెను కలిసిన సమయంలో యువతి ఈ విషయాన్ని తెలిపింది.