thailand: మృత్యువు ముంగిట వున్న కుక్కపిల్లను కాపాడాడు... వీడియో చూడండి
- వరదలో మునిగిపోయిన కుక్కపిల్ల
- నోట్లో గాలి ఊది బతికించిన మిలటరీ అధికారి
- వైరల్ అవుతున్న వీడియో
భారీగా కురిసిన వర్షాల కారణంగా బ్యాంకాక్‌లోని ఆర్మీ క్యాంప్‌లో వరద నీరు చేరింది. ఆ నీటిలో ఓ చిన్న కుక్కపిల్ల తేలుతుండటం చూశాడో ఆర్మీ పోలీసు. అది ఇంకా కళ్లు కూడా తెరవలేదు. పుట్టి రెండు లేదా మూడు రోజులు అయ్యుంటుంది. అప్పటికే దాని శరీరం నీలిరంగులోకి మారడం ప్రారంభమైంది. అది చనిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ దాని శరీరం ఇంకా వెచ్చగా ఉండటంతో దాన్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేశాడు.
ఆ కుక్కపిల్ల కడుపును నెమ్మదిగా నొక్కుతూ అది మింగిన నీటిని బయటికి రప్పించాడు. దాని నోటిలోకి గాలి ఊదాడు. దాని ఛాతీ భాగంపై గట్టిగా రుద్దాడు. ఇలా సీపీఆర్ (కార్డియోపల్మనరీ రెస్యూసైటేషన్) ప్రక్రియలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి ఆ కుక్కపిల్లను బ్రతికించాడు. థాయ్‌లాండ్ ఆర్మీలో పనిచేస్తున్న వీరఫాన్ సుకుదోమ్ చేసిన ఈ పనిని తన సహద్యోగి వీడియో తీశాడు.
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 3:42 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో కుక్కపిల్లను కాపాడటానికి అతను పడుతున్న కష్టం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. పక్కనుండి అతని సహోద్యోగులు ప్రోత్సహిస్తుండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.