fifa: ఫీఫా అండర్ 17 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం... అక్టోబర్ 6 నుంచి ప్రారంభం
- భారత్‌లో మొదటిసారి జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్
- మొత్తం ఆరు గ్రూపులు
- గ్రూపుకు నాలుగు జట్లు
- ఏడు నగరాల్లోని ఏడు స్టేడియాల్లో ఆటలు
ఫీఫా అండర్ 17 ప్రపంచకప్ క్రీడలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటిసారి ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే మొదటిసారి ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు పాల్గొంటోంది. అక్టోబర్ 6 సాయంత్రం 5 గం.లకు ఈ ప్రపంచకప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. గ్రూపుకి నాలుగు జట్ల చొప్పున ఆరు గ్రూపుల్లో 24 జట్లు పోటీ పడనున్నాయి.
దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లోని ఏడు స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. మొదటిరోజు గ్రూప్ 'ఎ' నుంచి కొలంబియా, ఘనా జట్లు, గ్రూప్ 'బి' నుంచి న్యూజిలాండ్, టర్కీ జట్లు పోటీపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో జరగనున్నాయి. గ్రూప్ ఎ జట్ల మ్యాచ్ న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో, గ్రూప్ బి జట్ల మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. సోనీ, డీడీ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ లను వీక్షించవచ్చు. ఇంటర్నెట్‌లో సోనీ లైవ్ ద్వారా చూడవచ్చు.