jai lava kusa: 'జై'ని చంపకుండా ఇలా చెప్పించి ఉంటే మరింత అద్భుతంగా ఉండేది!: పరుచూరి గోపాలకృష్ణ
- క్లైమాక్స్ డైలాగ్ ను మార్చి చెప్పిన పరుచూరి
- తన మదిలోని మాటేనన్న దిగ్గజ రచయిత
- విమర్శకుల మాటలు పట్టించుకోవద్దని ఎన్టీఆర్ కు సూచన
- నటనలో పెద్ద రామయ్యేనని కితాబు
ఎన్టీఆర్ హీరోగా రెండు వారాల క్రితం వచ్చి సూపర్ హిట్టయిన 'జై లవకుశ' క్లైమాక్స్ పై రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిత్రం చివర్లో 'జై' పాత్రను చనిపోయినట్టు చూపించకుండా ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయపడ్డ ఆయన, ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన ఎన్నటికీ గుర్తుండి పోతుందని అన్నారు.
క్లైమాక్స్ లో "నేననేది అబద్ధం.. మ.. మ.. మనం అనేదే నిజం. నాకోసం చచ్చిపోదామని కూడా మీరు అనుకున్నారని తెలిసిన తర్వాత కూడా నేనెలా చనిపోతానురా'' అని 'జై'తో చెప్పించి, ముగ్గురు అన్నదమ్ములపై షాట్ ను ఫ్రీజ్ చేసి సినిమాను ముగిస్తే, మరింత అద్భుతంగా ఉండేదని చెప్పారు.
ఇదేమీ తన రివ్యూ కాదని, తన మదిలో మెదిలిన ఊహేనని పరుచూరి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుకు మాత్రమే చిన్న రామయ్యని, నటనలో పెద్ద రామయ్యేనంటూ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. విమర్శకులకు ఈ చిత్రం ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని ఎన్టీఆర్ పట్టించుకోకుండా పక్కన పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.