kamal hasan: నేను వచ్చేంతవరకూ ఎవరూ ఏమీ మాట్లాడవద్దు: అభిమానులకు కమల్ కీలక సూచన

  • అభిమానులతో భేటీ అయిన కమల్ 
  • నవంబర్ 7లోగా మరోమారు సమావేశం
  • ప్రజాసేవ తప్ప మరే ప్రకటనలూ చేయవద్దని సూచన
  • సినిమాలు పూర్తయిన తరువాత రాజకీయాలన్న కమల్

తన రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన విలక్షణ నటుడు కమలహాసన్, ఈ ఉదయం అభిమాన సంఘాలతో సమావేశమై కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించేంత వరకూ ఏ అభిమాన సంఘం నుంచి ఎటువంటి ప్రకటనలూ రాకూడదని స్పష్టం చేశారు. అభిమానులెవరూ ఈ విషయమై మాట్లాడవద్దని సూచించిన కమల్, తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దని ఆదేశించారు.

 ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలని, ఎవరికైనా సహాయం అవసరమైన పక్షంలో వెంటనే స్పందించాలని కోరారు. తన జీవితంలో ఇది అత్యంత కీలకమైన సమయమని, ఇప్పటివరకూ వెన్నంటి నిలిచిన అభిమానులు, కొంతకాలం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కమల్ సూచించారు.
 
ఈ సమావేశంలో తమిళనాడులోని అన్ని జిల్లాలకు చెందిన కమల్ అభిమాన సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. నవంబర్ 7వ తేదీలోగా మరోమారు భేటీ అవుదామని, ఆ తరువాత రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేదీ తాను స్పష్టమైన తేదీని ప్రకటిస్తానని ఈ సందర్భంగా కమల్ హామీ ఇచ్చారు. ఈలోగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, నిర్మాణ దశలో ఉన్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంటానని తెలిపారు.

kamal hasan
movies
fans
  • Loading...

More Telugu News