health: రోగాలు దరిచేరకూడదా?... అయితే ఇవి పాటించండి!
- వ్యాధినిరోధక శక్తి పెంచుకునే మార్గాలు
- కొద్దిగా శ్రద్ధ పెడితే ఆరోగ్యానికి ఢోకా లేదు
- అందుబాటులో ఉండే పదార్థాలతో కొన్ని చిట్కాలు
మారుతున్న జీవన విధానంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా దొరకడం లేదు. ప్రతి చిన్న నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే టాబ్లెట్ వేసుకుని కాలం గడిపేయాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల శరీరంలో సహజంగా ఉండే వ్యాధినిరోధక శక్తి దెబ్బతింటుంది. దీంతో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై కొంత శ్రద్ధ వహించాలి. అందుకోసం జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాంటి కొన్ని చిట్కాలు మీకోసం....
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పాలు, చేపలు, మాంసం, గుడ్లలో అధికంగా ఉంటుంది. ఇంకా సులభంగా కావాలంటే సూర్యోదయం సమయంలో వచ్చే తొలి కిరణాల్లో 10-15 నిమిషాలపాటు ఉంటే విటమిన్ డి సమృద్ధిగా అందుతుంది. పని ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమయ్యే వారిలో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం 7-8 గం.ల పాటు నిద్ర పోయేందుకు ప్రయత్నించాలి.
ఎక్కువగా పండ్లు, మాంసాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే పసుపు, కారం, అల్లంవెల్లుల్లి, మిరియాలు వంటి పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. మద్యపానం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉంటూ, వాటికి బదులుగా యాంటీ ఆక్సిడెంట్లు అందించే తేనె, గ్రీన్‌టీ వంటి పానీయాలను తీసుకోవాలి. ఎక్కువగా నీరు త్రాగడం, వేళకు భోజనం తినడం, వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.