remittence: విదేశాల నుంచి ఎక్కువ డబ్బు పంపిస్తున్నది భారతీయులే!
- గతేడాది స్థానాన్ని పదిల పర్చుకోనున్న భారత్
- 2017లో 65 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
- ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి
విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడి సంపాదనను తమ సొంత దేశానికి పంపిస్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో `మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్` పేరుతో ప్రపంచబ్యాంకు ఈ నివేదికను తయారుచేసింది.
దీని ప్రకారం 2017లో 65 బిలియన్ డాలర్ల డబ్బును మాతృదేశానికి పంపి భారతీయులు మొదటిస్థానాన్ని స్థిరంగా ఉంచుకోనున్నారు. గతేడాది కూడా 62.7 బిలియన్ డాలర్లతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (61 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (33 బి.డాలర్లు), మెక్సికో (31 బి.డాలర్లు), నైజీరియా (22 బి.డాలర్లు) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలా వస్తున్న డబ్బు 3.9% పెరిగి 596 బిలియన్లు ఉంటుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌కు వస్తున్న డబ్బులో మార్పు లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లకు మాత్రం ధన ప్రవాహం తగ్గింది.