honeypreet: హనీ ప్రీత్ ను విచారిస్తున్న హర్యానా పోలీసులు అడుగుతున్న ప్రశ్నలివి!
- నిన్న అరెస్టయిన హనీప్రీత్ మరికాసేపట్లో కోర్టుకు
- ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు
- గుర్మీత్ తో సంబంధాలపై ఆరా
- హత్యలు, నిధుల రాకపైనా విచారణ
నిన్న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన గుర్మీత్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీ ప్రీత్ సింగ్ ను పోలీసులు గత రాత్రి ప్రాథమికంగా విచారించారు. నేడు ఆమెను పంచకుల కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకోవాలన్నది పోలీసుల ఉద్దేశం. హనీప్రీత్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
డేరా ఆశ్రమంలో సాధ్విలపై అత్యాచారం నిజమేనా? భక్తులను చంపి ఆశ్రమంలో పూడ్చి పెట్టారా? మీకు- గుర్మీత్ కు ఉన్న సంబంధం ఎలాంటిది? మీ భర్త చేసిన సంచలన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎందుకు మీకు, గుర్మీత్ కు మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టారు? శిష్యులను హిజ్రాలుగా మారుస్తున్నారని వచ్చిన ఆరోపణలు నిజమేనా? డేరాకు అత్యధికంగా నిధులను సమకూర్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకులు ఎక్కువగా ఆశ్రమానికి వచ్చేవారు? డేరా గుహలో పూల్ పార్టీలు నిర్వహించారా? వాటికి హాజరైన ధనవంతులైన మహిళలు ఎవరు? వంటి ప్రశ్నలను తయారు చేశారు.
డేరాలో బిగ్ బాస్ షో ఆడేవాళ్లా? ఆడితే అందులో పాల్గొన్నది ఎవరు? డ్రగ్స్ ను వాడుతారా? సాధ్వీలుండే గదుల్లోకి రహస్య సొరంగాలు ఎందుకు ఏర్పాటు చేశారు? గుర్మీత్ ఆ మార్గాల ద్వారా సాధ్వీల గదుల్లోకి వెళ్లేవారా? సినిమా రంగంలోకి ప్రవేశించింది ఎందుకు? బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికేగా? భక్తుల విరాళాలతోనే డేరాలో విలాసవంతమైన కట్టడాలు కట్టారా? వంటి ప్రశ్నలనూ అడగనున్నారు.
కాగా, గత రాత్రి మహిళా పోలీసు అధికారులు హనీప్రీత్ ను అర్థరాత్రి వరకూ విచారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. మరికాసేపట్లో ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు.