nellore: అధికారిక హోదాలో మొదటిసారి సొంత జిల్లాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి
- సాయంత్రం వరకు జిల్లాలోనే గడపనున్న వెంకయ్యనాయుడు
- షార్ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలతో ప్రారంభం
- ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంతో ముగింపు
- భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి అధికారిక హోదాలో నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన జిల్లాలో వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. భారీ బందోబస్తుతో ఉపరాష్ట్రపతి పర్యటనకు కావాల్సిన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు కేంద్రం నుంచి కూడా బలగాలు నెల్లూరుకు చేరుకున్నాయి. షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రారంభం, అక్షర విద్యాలయ పర్యటన, కస్తూరిదేవి గార్డెన్స్‌లోని వివాహ రిసెప్షన్ వేడుకలు, కస్తూర్బా కళాక్షేత్రంలో ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవ వేడుకలలో వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.
విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భారత నావికాదళానికి సంబంధించిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో షార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.30 గంటలకు ఎంఆర్‌కే ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు బయలుదేరుతారు. స్వర్ణభారతినగర్‌లోని అక్షర విద్యాలయంలో భోజనం చేసి, కస్తూరిదేవి గార్డెన్స్‌లో జరుగుతున్న చంద్రశేఖరరాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 4.25 గంటలకు ఉపరాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు.