brazil: బ్యాంకు దోపిడీకి నెలల పాటు శ్రమించి అర కిలోమీటరు సొరంగం... ఆపై దొరికిపోయారు!
- భగ్నం చేసిన బ్రెజిల్ పోలీసులు..16 మంది అరెస్ట్
- నాలుగు నెలలు శ్రమించి, 600 మీటర్ల సొరంగం
- లోపల ఫ్యాన్లు, లైట్లు
- సక్సెస్ అయ్యుంటే అతిపెద్ద దోపిడీ అయ్యేది
బ్రెజిల్ లో దోపిడీదారులు వేసిన మాస్టర్ ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు. శావ్ పావ్ లో నగరంలోని ఓ బ్యాంకును కొల్లగొట్టాలన్న ఆలోచనతో భూగర్భంగా అర కిలోమీటరుకు పైగా సొరంగాన్ని తవ్విన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బ్రెజిల్ ఆర్థిక రాజధానిగా పేరున్న శావ్ పావ్ లో లోని ప్రముఖ బ్యాంకు 'బ్యాంకో డో బ్రెజిల్' నుంచి కనీసం బిలియన్ రియేస్ లను (సుమారు 317 మిలియన్ డాలర్లు) దొంగిలించాలని 16 మంది కలసి ప్లాన్ చేశారు.
బ్యాంకుకు కొన్ని ఇళ్ల అవతల నుంచి పని ప్రారంభించారు. నాలుగు నెలల పాటు శ్రమించి 2000 అడుగుల దూరం... అంటే దాదాపు 600 మీటర్ల సొరంగం తవ్వారు. సొరంగం కూలకుండా ఉండేందుకు ఉక్కు రాడ్లను అమర్చారు. లోపల లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని రోజులైతే వారి ప్లాన్ ఫలించేది కూడా.
అదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీగా వీరి ప్రయత్నం రికార్డును సృష్టించేదని, వీరిని అరెస్ట్ చేసిన పోలీస్ చీఫ్ ఫాబియో ఫిన్ హెరో లోపేజ్ వెల్లడించారు. నిత్యమూ తమ ప్రాంతంలో భూగర్భంలో ఏవో శబ్దాలు వస్తున్నాయని పోలీసులకు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుతో ఈ రాబరీ ప్లాన్ ను విఫలం చేశామన్నారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.