hacking: 6 వేల భారతీయ సంస్థల సమాచారం ఉంది... 42 లక్షలకే అమ్మేస్తా!: హ్యాకర్ సంచలన ప్రకటన
- డార్క్ నెట్ లో హ్యాకర్ సంచలన ప్రకటన
- ప్రభుత్వ సంస్థల సమాచారం చోరీ
- ఐపీ అడ్రస్ లను కేటాయించే ఐఆర్ఐఎన్ఎన్ పై హ్యాకర్ దాడి
డార్క్ నెట్ లో ఒక హ్యాకర్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఐటీ భద్రతా సంస్థ క్విక్ హీల్ కు చెందిన ‘సీక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ గుర్తించిన దాని ప్రకారం డార్క్ నెట్ లో ఒక హ్యాకర్ ఒక సంచలన ప్రకటన పెట్టాడు. అందులో తన దగ్గర 6 వేల భారతీయ సంస్థలకు చెందిన కీలక సమాచారం ఉందని తెలిపాడు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ముఖ్యమైన సమాచారం ఇందులో ఉందని తెలిపాడు. ఈ సమాచారం ఖరీదు కేవలం 42 లక్షల రూపాయలేనని ప్రకటించాడు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సమాచార చౌర్యం అని క్విక్ హీల్ అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను సమీక్షించడం, ఐపీ అడ్రస్ లను కేటాయించే ‘నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా’కు చెందిన కీలక సంస్థ ‘ఇండియన్ రిజిస్ట్రీ ఫర్ ఇంటర్నెట్ నేమ్స్ అండ్ నెంబర్స్’ (ఐఆర్ఐఎన్ఎన్) పైనే హ్యాకర్ దాడి చేసి, కీలక సమాచారం చోరీ చేశాడని నిపుణులు నిర్ధారించారు. దీంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అర్గనైజేషన్, ఇస్రో, ఆర్బీఐ, ఎస్బీఐ, బీఎస్ఎన్ఎల్, ఈపీఎఫ్ఓ వంటి కీలక ప్రభుత్వ సంస్థలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయని వారు తెలిపారు.