anna hazare: నాలా బ్రహ్మచారిగా ఉండిపోవద్దు... హాయిగా పెళ్లి చేసుకోండి!: 'పెళ్లికాని ప్రసాదు'లకు అన్నాహజారే సలహా
- బ్రహ్మచారిగా ఉండడం చాలా కష్టం
- వివాహం చేసుకోకూడదని పాతికేళ్ల వయసులో నిర్ణయించుకున్నాను
- విశ్వామిత్రుడంతటి వాడే మేనక రాకతో చలించిపోయాడు
- యువత వివాహం చేసుకోవాలి
కారణాలేవైనా కానీ సమాజంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకులు వివాహం చేసుకోవాలని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సూచించారు. ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, తనలా ఎవరూ బ్రహ్మచారిగా మిగిలిపోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని ఆయన అభిలషించారు. బ్రహ్మచారిగా ఉండటం సులువు కాదని తెలిపారు. పదునైన కత్తిపై నడవడంకంటే బ్రహ్మచారిగా ఉండడం చాలా కష్టమని చెప్పారు.
యువత తమ ఇష్టానికి అనుగుణంగా రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలు కాకుంటే మరేదైనా రంగాన్ని ఎంచుకోవాలి కానీ, తనలా కావాలని మాత్రం భావించవద్దని ఆయన సూచించారు. పెళ్లి చేసుకోకుండా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయాలని పాతికేళ్ల వయసులో తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. విశ్వామిత్ర మహర్షి అంతటివాడే వేల ఏళ్ల పాటు తపస్సునాచరించి మేనక కారణంగా చలించిపోయాడని అన్నారు. మనసు చంచలమైనదని ఆయన తెలిపారు. తానెవరికీ వివాహం చేసుకోవద్దని చెప్పలేదని ఆయన అన్నారు.