Jimmy Kimmel: లాస్ వెగాస్ సంఘటనపై టీవీలో కంటతడి పెట్టుకున్న అమెరికన్ యాంకర్
- బాధాతప్త హృదయంతో మాట్లాడిన జిమ్మీ కెమ్మెల్
- తన సొంత ఊరు లాస్ వెగాస్
- 59 మంది మృతికి సంతాపం తెలిపిన యాంకర్
అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కాల్పుల సంఘటన గురించి తన కార్యక్రమం `జిమ్మీ కెమ్మెల్ లైవ్`లో ప్రముఖ అమెరికన్ యాంకర్ జిమ్మీ కెమ్మెల్ కంటతడి పెట్టుకున్నాడు. తాను పుట్టి పెరిగిన లాస్ వెగాస్ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడంతో జిమ్మీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కాల్పుల ఘటనలో చనిపోయిన 59 మందికి నివాళులు అర్పించాడు.
ఈ సందర్భంగా అమెరికాలో విరివిగా జరుగుతున్న కాల్పుల ఘటనల గురించి జిమ్మీ మాట్లాడాడు. `ఆహ్లాదం కోసం పాటలు వినడానికి వచ్చిన వారు అన్యాయంగా బలయ్యారు. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం ఎందుకు? ఒక్కరి క్షణికావేశం వల్ల ఎంతోమంది అనాథలు కావాల్సి వచ్చింది` అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. గతంలో ఒర్లాండో, న్యూటౌన్, అరోరా, శాన్ బెర్నాండినో, లారెన్స్ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలను కూడా జిమ్మీ గుర్తు చేశాడు. ఒక్క వ్యక్తి హింసాత్మక ధోరణి కారణంగా ఎన్నో కుటుంబాలు ఆ బాధను భరించాల్సి వస్తోందని, ఈ సంస్కృతిని విడనాడాలని ఆయన కోరాడు. సోమవారం అమెరికా టీవీల్లో ప్రసారమైన అన్ని ప్రైమ్ టైమ్ షోలు లాస్ వెగాస్ మృతులకు నివాళులర్పించాయి.