prakash raj: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు... అవార్డులు తిరిగిచ్చే విషయంపై స్పష్టతనిచ్చిన ప్రకాశ్‌రాజ్
- అవార్డులు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదు
- ప్రధాని మౌనంగా ఉన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాను
- ఏ పార్టీ గురించి మాట్లాడలేదు
ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే మంచి నటుడని, అందుకే తాను గెల్చుకున్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఆయన కోసం తిరిగిచ్చేస్తానని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేసినట్టు సోమవారం మీడియాలో కథనాలు వచ్చాయి. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై మోదీ మౌనంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇలా మాట్లాడినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే వాటిలో నిజం లేదని, తాను ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
`నేను మాట్లాడిన విషయాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అవార్డులు తిరిగి ఇచ్చేస్తానని వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను కష్టపడి పని చేసి గెల్చుకున్న అవార్డులను తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాను. అవి నాకు గర్వకారణం` అని వీడియోలో వివరించారు. గౌరీ లంకేశ్ హత్య గురించి తాను మాట్లాడిన విషయాలపై ఆయన సరైన అర్థాన్ని కూడా చెప్పారు. `అంతటి గొప్ప పాత్రికేయురాలు హత్యకు గురైతే మన ప్రధాని ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం ఏం బాగోలేదు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉంటే ఓ పౌరుడిగా నాకు భయమేస్తోంది. తీవ్రంగా బాధ కూడా కలుగుతోంది. అందుకే ఓ పౌరుడిగా నాకు అలా అనే హక్కు ఉంది కాబట్టి స్పందించాను. కానీ దాన్ని వక్రీకరించి ప్రకాశ్ రాజ్ అవార్డులు ఇచ్చేస్తానన్నారు అని ప్రచారం చేయడం సబబు కాదు. నాకు అవార్డులు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన కూడా లేదు.’ అని అన్నారు.