lasvegas: లాస్ వెగాస్ లో కాల్పులు జరిపిన నరహంతకుడి వివరాలివే!

  • 1980ల్లో లాక్‌ హీడ్‌ మార్టిన్‌ లో ఇంటర్నల్‌ ఆడిటర్‌ గా పని చేసిన పాడ్డాక్
  • హంటింగ్, ఫిషింగ్, పైలట్ లైసెన్సులతో పాటు రెండు చిన్న విమానాలు కలిగిన పాడ్డాక్
  • నేర చరిత్ర లేదన్న పోలీసులు...అతని తండ్రి మాత్రం నేరగాడు  

లాస్‌ వెగాస్ లో మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై తూటాల వర్షం కురిపించి నరమేధం సృష్టించిన స్టీఫెన్‌ క్రెయిగ్‌ పాడ్డాక్‌ (64) కు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడి పోలీసులు సేకరించారు. మాండలే బే రిసార్ట్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్యంలో ఉన్న మెస్‌ క్వీట్‌ లో పాడ్డాక్ నివాసముంటున్నాడు. ఇక్కడ రిటైర్ అయినవారు నివాసముండే ప్రాంతంలో అతను కూడా నివాసముండడం విశేషం. అతని మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారం తనిఖీలు చేసిన పోలీసులు అతనికి ఎలాంటి నేరచరిత్ర లేదని నిర్ధారించారు. అతని నివాసంలో భారీ ఎత్తున తుపాకులు, తూటాలు గుర్తించారు.

అతడితో పాటు మారిలో డాన్లే అనే మహిళ కూడా ఉంటోందని, అయితే ఆమె ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఉంటుందని, ఆమెతో తాము మాట్లాడామని వెల్లడించారు. పాడ్డాక్ కు హంటింగ్, ఫిషింగ్, పైలట్ లైసెన్సులు ఉన్నాయని తెలిపారు. అలాగే అతనికి రెండు చిన్నపాటి విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు. 1980ల్లో లాక్‌ హీడ్‌ మార్టిన్‌ లో ఇంటర్నల్‌ ఆడిటర్‌ గా మూడేళ్లపాటు పనిచేసినట్టు గుర్తించారు.

 అతనికి ఎలాంటి మత, రాజకీయ, మిలటరీ సంస్థలతో సంబంధాలు లేవని అతని సోదరుడు తెలిపాడు. అలాగే తన సోదరుడు చాలా మంచివాడని, ఇది తన సోదరుడే చేశాడంటే నమ్మశక్యంగా లేదని తెలిపాడు. అయితే పోకర్ (జూదం) ఆటంటే తన సోదరుడికి చాలా ఇష్టమని, దాని కోసమే తన నివాసాన్ని లాస్ వెగాస్ కు మార్చాడని తెలిపాడు.

అతనికి ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పిన పోలీసులు, అతని తండ్రి హాస్కిన్స్‌ బెంజమిన్‌ పాడ్డాక్‌ కరుడుగట్టిన దొంగ అని తెలిపారు. వరుస బ్యాంకు దొంగతనాలతో పోలీసు రికార్డులకెక్కాడని తెలిపారు. ఒక కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి టెక్సాస్‌ కేంద్ర కారాగారంలో శిక్షననుభవించి, 1969లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడని వెల్లడించారు.

 అప్పుడు ఎఫ్బీఐ అతనిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిందని, 8 ఏళ్లపాటు ఆ పేరు ఆ జాబితాలో ఉందని తెలిపారు. వైద్యులు అతనిని సైకోపాత్ గా పేర్కొన్నారని, అతనికి ఆత్మహత్య చేసుకునేంత ఉన్మత్తత ఉందని తెలిపారని వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ తామేనని ప్రకటించే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి అతను తమవాడేనని, ఈమధ్యే మతం మార్చుకున్నాడని తెలిపింది. 

  • Loading...

More Telugu News