Madhya Pradesh: మురికి కాలువను క్లీన్ చేయమన్నారని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్
- ఆత్మహత్యాయత్నానికి ముందు ఎస్హెచ్ఓపై ఆరోపణలు
- ఎస్పీ తనను పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేయడంతో మనస్తాపం
- పరిస్థితి విషమం
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మురికి కాలువను శుభ్రం చేయమన్నందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగిందీ ఘటన.
తనతో బలవంతంగా మురికి కాలువను క్లీన్ చేయించాలని చూడడాన్ని జీర్ణించుకోలేకపోయిన హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ శుక్లా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ)పై ఆయన ఆరోపణలు చేశారు.
‘‘ఎస్‌హెచ్ఓ తనను కాలువ క్లీన్ చేయమని చెప్పారు. నేను అందుకు నిరాకరించా. దీంతో నాపై ఫోన్లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్లో ఎస్పీకి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన నన్ను పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేస్తున్నట్టు చెప్పారు’’ అని విషం తీసుకోవడానికి ముందు మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం భింద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కానిస్టేబుల్ రాజ్‌కుమార్ శుక్లా మీడియా ఎదుట చేసిన ఆరోపణలను బింద్ జిల్లా పోలీసులు ఖండించారు.