lasvegas: పది తుపాకులు.. 2,000 తూటాలు.. లాస్ వెగాస్ నరమేధం సాగిందిలా!
- లాస్ వెగాస్ లో నరమేధం.. 58 మంది మృతి
- రూట్ హార్వెస్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ కు హాజరైన 22,000 మంది
- మాండలే బే హోటల్ 32వ అంతస్తు 137వ రూం నుంచి కాల్పులు
- శక్తిమంతమైన అసాల్ట్ రైఫిల్ తో కాల్పులు
అమెరికాలోని లాస్ వెగాస్ లోని మాండలే బేలో మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొన్న వారిపై జరిగిన నరమేధాన్ని చూసిన సాక్షులు వణికిపోతున్నారు. ఆ పీడకల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. నెవెడా స్టేట్ లోని లాస్ వెగాస్ స్ట్రిప్ లో మాండలే బే ఎదురుగా గల ఖాళీ స్థలంలో ‘రూట్ 91 హార్వెస్ట్’ పేరిట మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 22,000 మంది హాజరయ్యారు.
ప్రముఖ సంగీతకారుడు జేసన్ అల్డీన్ పాడుతున్న గీతాలకు వీక్షకులు లయబద్ధంగా ఆనందంగా స్టెప్పులేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో మాండలే బే హోటల్ 32వ అంతస్తు నుంచి తూటాలు దూసుకొచ్చాయి. పది సెకన్లపాటు విరామం లేకుండా భారీ ఎత్తున తూటాలు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సాధారణంగా తుపాకీ కాల్పులు జరిగినప్పుడు నేలపై బోర్లాపడుకుని పాక్కుంటూ వెళ్తే ఏ ప్రమాదమూ ఉండదని భావించిన వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ నేలపై పడినవారు నేలకు అంటుకుపోయేలా కాల్పులు జరిగాయని తెలిపారు. పది సెకన్ల అనంతరం కొన్ని సెకన్ల విరామం ఇచ్చి మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. పై నుంచి కాల్పులు జరగడంతో నేలను ఆసరా చేసుకునే అవకాశం కూడా లభించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కాన్సర్ట్ చూసేందుకు వచ్చినవారు పరుగులు తీశారని తెలిపారు. ఇంతలో స్వాట్ టీమ్ వచ్చి, కాల్పులు జరిగిన ప్రదేశాన్ని గుర్తించి, హోటల్ కు వెళ్లి 32వ అంతస్తు మొత్తం ఖాళీ చేసి, అతని రూమ్ (రూమ్ నెంబర్ 137) తలుపులు బద్దలు కొట్టారు.
అక్కడ సుమారు 10 తుపాకులు కనిపించాయి. అప్పటికే తనను తాను కాల్చుకుని విగత జీవుడిగా మారిన దుండగుడిని స్టీవెన్ పడాక్ (64) గా గుర్తించారు. సెప్టెంబర్ 28 నుంచి తన ప్రియురాలి గుర్తింపు కార్డులతో రూం తీసుకుని ఉన్న పడాక్ వేల డాలర్లు క్యాసినోలో జూదమాడినట్టు పోలీసులు గుర్తించారు. శక్తిమంతమైన అసాల్ట్ రైఫిల్ తో కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 2,000 బుల్లెట్లు దూసుకెళ్లాయని వారు వెల్లడించారు. ఈ కాల్పుల్లో 58 మంది మృతి చెందగా, 515 మంది గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.