Las Vegas: జూదం, వ్యభిచారం, వినోదం.. లాస్‌వేగాస్ వందేళ్ల చరిత్ర ఇదే!
- కొంప ముంచిన మితిమీరిన స్వేచ్ఛ
- ప్రధాన ఉపాధిగా కేసినోలు
- ఆనందాన్ని వెతుక్కునేందుకు వచ్చే పర్యాటకులు
లాస్‌వేగాస్.. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఎడారి నగరం ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేరపూరిత స్వభావానికి పెట్టింది పేరైన ఈ నగరంలో వ్యక్తిగత రక్షణ కోసం ఆయుధాలు కొనుక్కునే స్వేచ్ఛ ఉంది. వాటిపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు. ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ఈ మితిమీరిన స్వేచ్ఛ కూడా కారణమని చెబుతున్నారు.
1848 నుంచి ఈ ప్రాంతం మెక్సికో నుంచి అమెరికా పాలనలోకి వచ్చింది. 1855లో స్థానిక గిరిజనులు కోట కట్టుకుని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా ఎక్కువకాలం ఉండలేకపోయారు. దీంతో ఓ ఎస్టేట్ యజమాని ఆ కోటలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని లాస్‌వేగాస్ రాంచ్ అని పేరు పెట్టుకున్నాడు. మొదట్లో ఇక్కడ ఎస్టేట్ యజమానులు, కార్మికులు మాత్రమే నివసించేవారు. అయితే 1905లో రైల్ రోడ్ కంపెనీ ఇక్కడ ప్లాట్లు వేసింది. 1911లో లాస్‌వేగాస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఈ నగరం చీకటి ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
వ్యభిచారం, జూదం, ఇతర వినోద కార్యక్రమాలు ఇక్కడ నిత్యకృత్యం. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. లక్షల కోట్ల డాలర్లను నీళ్లలా కుమ్మరిస్తారు. డ్రగ్స్, దొంగ వ్యాపారాల్లో సంపాదించిన మొత్తాన్ని ఇక్కడి కేసినోలలో పెడుతూ ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక్కడి ప్రధాన ఉపాధి కేసినోలే. 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోయినా, లాస్వేగాస్పై మాత్రం ఆ ప్రభావం పడలేదు. ఏటా నాలుగు కోట్ల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూనే ఉన్నారు.