tirumala: నేడు తిరుమలలో కాలు పెడితే దర్శనం మాత్రం రేపు సాయంత్రమే!

  • వరుస సెలవులతో భక్తులతో నిండిపోయిన ఏడు కొండలు
  • బ్రహ్మోత్సవాల రద్దీ ముగిసిందని భావించి వచ్చిన వేలాది మంది
  • అన్ని కంపార్టుమెంట్లూ నిండి వెలుపల నాలుగు కి.మీ. దాటిన క్యూలైన్

వరుస సెలవుల కారణంగా తిరుమల గిరులు భక్త జనులతో కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాల వేళ, భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భయపడి ఈ దసరా సీజన్ లో తిరుమలకు రాని భక్తులంతా నిన్న సాయంత్రం నుంచి పోటెత్తారు. దీంతో నిన్న సాయంత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ భక్తులతో నిండిపోగా, ఈ మధ్యాహ్నానికి క్యూలైన్ నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్లను దాటి బయటకు నాలుగు కిలోమీటర్ల మేరకు వ్యాపించింది.

ప్రస్తుతం బయట క్యూ లైన్లో నిలుచున్న వారికి రాత్రి 9 గంటల తరువాతే కంపార్టుమెంట్లలోకి ప్రవేశం లభించే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశం, కాలినడక భక్తుల దివ్యదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. క్యూలో వేచి ఉన్న వారికి అన్నపానీయాల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఆలయంలో మహా లఘుదర్శనాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు తిరుమల చేరుకున్న భక్తులు అద్దె గదులు లభించక, ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. పిల్లా పాపలతో వచ్చిన భక్తులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

tirumala
tirupati
queue line
compartments
vaikuntam
  • Loading...

More Telugu News