gandhi jyanthi: మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల పార్టీలో ఉండటం గర్వకారణం: రఘువీరారెడ్డి
- విజయవాడలో ఘనంగా గాంధీ, శాస్త్రిల జయంతి వేడుకలు
- నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు
- గాంధీ, శాస్త్రిల స్ఫూర్తితో పని చేస్తామన్న రఘువీరా
- ప్రస్తుతం మత శక్తుల చేతుల్లోకి దేశం వెళ్లిపోయింది
- కులం, మతం ఆధారంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు
ఈరోజు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మహానుభావులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాము ఉండటం గర్వకారణంగా ఉందని అన్నారు. అహింస నినాదంతో మహాత్మాగాంధీ యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గాంధేయవాదిగానే కొనసాగారని చెప్పారు. లక్ష్యాన్ని సాధించడంలో వేటినీ పరిగణనలోకి తీసుకునేవారు కాదని తెలిపారు.
ఈ మహానేతల స్ఫూర్తితో, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. అందరూ సమానమనే ఆయుధాన్ని గాంధీ మనకు ఇచ్చి వెళ్లారని చెప్పారు. జై జవాన్, జైకిసాన్ అంటూ శాస్త్రి పిలుపునిచ్చారని తెలిపారు. గాంధీ, శాస్త్రిల స్ఫూర్తితో అఖండ భారతావని కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమేనని చెప్పారు.
ప్రస్తుతం మన దేశం మతోన్మాదుల చేతుల్లో ఉందని... కులం, మతం పేరుతో ప్రజలను కొందరు రెచ్చగొడుతున్నారని రఘువీరా మండిపడ్డారు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని చెప్పారు. ఈరోజు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో మహాత్మాగాంధీ 148వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల 113వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వీరికి ఘన నివాళి అర్పించారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొండ్రు మురళి, ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తదితర నేతలు హాజరయ్యారు.