swachch bharat: స్వచ్ఛ భారత్‌కి మూడేళ్లు... సాధించిన విజయాలపై పెదవి విరుస్తున్న విశ్లేషకులు
- టాయిలెట్లు ఉన్నా వాడటం లేదని ఆరోపణ
- తప్పుల తడకగా అధికారిక లెక్కలు
- క్షేత్రస్థాయి సర్వేలు చేయాలని సలహా
2019, అక్టోబర్ 2 నాటికి భారతదేశంలో బహిరంగ మలవిసర్జన అనేది లేకుండా చేయాలనే లక్ష్యంతో 2014, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ఈరోజుతో ఆ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా లక్ష్యాన్ని చేరడానికి రెండేళ్ల సమయం ఉంది. కానీ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించామనే విషయంపై మాత్రం అధికారిక లెక్కలు, అనధికారిక లెక్కల్లో చాలా తేడా కనిపిస్తోంది.
2014లో 38.7 శాతం ఇళ్లలో టాయిలెట్స్ ఉండేవి. స్వచ్ఛ భారత్ పుణ్యమాని వాటి సంఖ్య 69.04 శాతానికి పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కట్టిన టాయిలెట్లలో ఎంతమంది వాటిని ఉపయోగిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో ఇళ్లలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ చాలా మంది ప్రజలు బహిరంగ మల విసర్జనకే మొగ్గు చూపుతున్నారు.
అలాగే దేశంలో ఉన్న 6,49,481 గ్రామాల్లో 2,50,000 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా గుర్తింపు పొందినట్లు అధికారిక లెక్కల్లో ఉంది. అయితే వీటిలో దాదాపు 1,50,000 గ్రామాల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. ఈ విధంగా స్వచ్ఛ సరేక్షణ్ పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలు ఎలాంటి క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించకుండా, నోటి మాటగా ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.