australia cricket: టీమిండియాపై 4-1 తేడాతో ఓడిపోవడంపై ఆసీస్ కెప్టెన్ స్పందన
- ఓటమికి మేము అర్హులమే
- వరుసగా వికెట్లు కోల్పోయాం
- భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు
- టీ20లోనైనా గెలుస్తాం
ఇటీవలి కాలంలో వరుస సిరీస్ విజయాలతో మంచి ఊపు మీదున్న టీమిండియా... అదే ఆటతీరుతో ఆస్ట్రేలియాను సైతం చిత్తు చేసింది. సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్ లో కంగారూలను 4-1 తేడాతో చిత్తుచేసి మరో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పరాభవానికి తాము అర్హులమే అని ఒకింత నిర్వేదంగా అన్నాడు. భారత్ అన్ని విభాగాల్లో అద్భుత ఆట తీరును కనబరిచిందని చెప్పాడు. రానున్న సిరీస్ లలోనైనా తాము మరింత స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉందని అన్నాడు.
చివరి వన్డేలో తాము 300 పరుగులు చేస్తే బాగుండేదని... 50 నుంచి 60 పరుగులు తక్కువ చేయడం వల్లే ఓటమిపాలయ్యామని స్మిత్ చెప్పాడు. టాప్ ఆర్డర్ లో ఒక బ్యాట్స్ మెన్ భారీ స్కోరు చేస్తే బాగుండేదని... దీనికి విరుద్ధంగా, తాము వరుసగా వికెట్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ లో తమ ఆటగాళ్లు బాగానే రాణించారని... అయినా దీన్ని ఓటమికి సాకుగా చూపబోమని చెప్పాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని... జట్టు సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉందని కితాబిచ్చాడు. టీ20లో మెరుగైన ప్రదర్శన చేస్తామని... ఈ ట్రోఫీనైనా ఇంటికి తీసుకెళతామని చెప్పాడు.