garikapati: ఐలయ్యతో చర్చించేందుకు నేను సిద్ధంగా లేను: గరికపాటి
- ఆచార్యుని స్థానంలో ఉన్న ఐలయ్య జ్ఞానాన్ని పంచాలి
- అజ్ఞానాన్ని పెంచకూడదు
- ఒక కులాన్ని కించపరచడం సరికాదు
ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో చర్చించేందుకు తాను సిద్ధంగా లేనని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తెలిపారు. ఒక టీవీ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ఆచార్యుని స్థానంలో ఉన్న ఐలయ్య జ్ఞానాన్ని పంచాలని అన్నారు. అజ్ఞానాన్ని పెంచడం, పంచడం సరికాదని ఆయన హితవు చెప్పారు. ఒక కులాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రాయడం సమర్థనీయం కాదని ఆయన చెప్పారు.
ఇప్పుడు సమాజంలో పుట్టుకను బట్టి కులాలు వర్తింపజేస్తున్నారని, గతంలో పనిని బట్టి ఆయా వ్యక్తుల కులాన్ని పేర్కొనేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కులవృత్తులు లేవని, ఎవరైనా, ఏ పని అయినా చేయవచ్చని ఆయన అన్నారు. అలాంటి నేపథ్యంలో ఒక కులాన్ని కించపరచడం సరికాదని ఆయన తెలిపారు.
తాను జ్ఞానాన్నిపెంచేలా మాట్లాడగలను తప్ప, అజ్ఞానాన్నిపెంచేలా మాట్లాడలేనని అన్నారు. చర్చల్లో పాల్గొనేటప్పుడు సద్విమర్శను స్వీకరించాలని ఆయన చెప్పారు. అలా కాకుండా చర్చల్లో అహం ప్రవేశిస్తోందని, దాని వల్ల అవతలి వ్యక్తి చెప్పిన దానితో ఎవరూ ఏకీభవించడం లేదని ఆయన అన్నారు.