agarkar: 17 సంవత్సరాలుగా ఎవరూ బద్దలు కొట్టలేకపోయిన అగార్కర్ బ్యాటింగ్ రికార్డ్... చాన్స్ పాండ్యాకా... కోహ్లీకా?
- 2000 నుంచి పదిలంగా అగార్కర్ రికార్డు
- 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
- ఆ ఫీట్ చేయలేకపోయిన దిగ్గజ క్రికెటర్లు
వన్డే క్రికెట్ పోటీల్లో శరవేగంగా సెంచరీ చేసింది ఎవరు? వెంటనే తట్టే సమాధానం డెవిలియర్స్. 16 బంతుల్లో హాఫ్ సెంచరీతో పాటు 59 బంతుల్లో 149 పరుగులను సాధించాడు డెవిలియర్స్. ఇక వన్డేల్లో ఇండియా తరఫున నమోదైన అత్యంత వేగవంతమైన అర్ధ శతకం ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానంగా ఏ సెహ్వాగో, యువరాజ్ సింగో పేరో మనకు గుర్తొస్తుంది.
కానీ ఈ రికార్డు ఒకప్పుడు బౌలర్ గా రాణించిన అజిత్ అగార్కర్ పేరిట ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. గత 17 సంవత్సరాలుగా ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. సచిన్, ధోనీ, సెహ్వాగ్, యువరాజ్, రైనా, రోహిత్ శర్మ, కోహ్లీ వంటి వాళ్లెవరికీ ఈ రికార్డును బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు.
ఇంతకీ, ఈ హాఫ్ సెంచరీ ఎప్పుడు అగార్కర్ ఖాతాలో చేరిపోయిందో తెలుసా? డిసెంబర్ 14, 2000 సంవత్సరంలో. అప్పట్లో ఐదు వన్డే పోటీల కోసం జింబాబ్వే జట్టు ఇండియాకు రాగా, రాజ్ కోట్ లో జరిగిన చివరి వన్డేలో అగార్కర్ ఈ ఫీట్ సాధించాడు. హేమంగ్ బదానీ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడి 21 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని దాటాడు.
ఆపై 17 ఏళ్లుగా మరెవరూ ఈ ఫీట్ ను చేరుకోలేదు. కాగా, 1998లో టీమిండియాలోకి వచ్చిన అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎంతో దూకుడుగా ఆడుతున్న కోహ్లీ లేదా పాండ్యాలకు ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.