icc new rules: ఐసీసీ కొత్త నిబంధనలు ఉల్లంఘించిన తొలి క్రికెటర్... శిక్ష పడింది!
- మూడు రోజుల క్రితం అమల్లోకి కొత్త రూల్స్
- ఉల్లంఘించిన క్వీన్స్ లాండ్ ఆటగాడు
- బంతి చేతిలో లేకున్నా ఉన్నట్టు నటన
- 5 పరుగుల శిక్ష విధించిన అంపైర్లు
క్రికెట్ లో మరింత పారదర్శకత, అంతర్జాతీయ స్థాయి నిబంధనలను ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ప్రవర్తనా నియమావళిని మార్చిన నేపథ్యంలో, నిబంధనలు ఉల్లంఘించి శిక్షకు గురైన తొలి జట్టుగా క్వీన్స్ లాండ్ నిలిచింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చి మూడు రోజులైనా గడవక ముందే ఓ ఆటగాడు వాటిని ఉల్లంఘించగా, ఆ జట్టుకు ఐదు పరుగుల కోత పడింది.
ఆస్ట్రేలియాలో జేఎల్టీ కప్ టోర్నీ జరుగుతూ ఉండగా, ఆస్ట్రేలియా ఎలెవన్, క్వీన్స్ లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆట 27వ ఓవర్ లో ఆసీస్ క్రికెటర్ బంతిని బాది పరుగు కోసం ప్రయత్నించగా, ఫీల్డింగ్ చేస్తున్న ఓ ఆటగాడు, తన చేతిలో బంతి లేకున్నా, ఉన్నట్టుగా నటిస్తూ, దాన్ని విసురుతున్నట్టు యాక్ట్ చేసి, బ్యాటింగ్ చేసిన ఆటగాడిని తప్పుదారి పట్టించాడు. కొత్త నిబంధనల ప్రకారం ఇది తప్పే. దీంతో ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపిస్తూ, క్వీన్స్ లాండ్ జట్టుకి ఐదు పరుగుల కోత విధించారు. దీంతో నూతన రూల్స్ మీరి శిక్షించబడ్డ తొలి క్రికెట్ జట్టుగా క్వీన్స్ లాండ్ నిలిచిపోయింది.