tirumala: ఎడతెరిపి లేని వర్షంలోనే శ్రీవారి చక్రస్నానం!
- నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
- వైభవంగా స్వామివారి స్నపన తిరుమంజనం
- ఆపై పుష్కరిణిలో చక్రస్నానం
- సాయంత్రం ధ్వజావరోహణ
తిరుమలలో ఈ తెల్లవారుఝాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనుండగా, తెల్లవారుఝామున పల్లకీ ఉత్సవం కూడా వర్షంలోనే కొనసాగింది. అనంతరం వరాహ మండపం వద్ద స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కార్యక్రమం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల వేళ, వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేసిన స్వామి, నేడు చక్రత్తాళ్వార్ రూపంలో ఉభయ దేవేరులతో కలసి పుష్కరిణిలో స్నానమాచరించారు.
తిరిగి స్వామి ఆనంద నిలయానికి చేరుకునే ముందు వేద మంత్రోచ్చారణల మధ్య పంచామృతాలతో అర్చకులు చేసిన అభిషేక కైంకర్యాన్ని ఆయన అందుకున్నారు. చక్రస్నాన సమయంలో స్వామితో పాటు పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆనందోత్సాహాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కాగా, చక్రస్నానంతో ఈ ఏటి బ్రహ్మోత్సవాలు ముగియనుండగా, సాయంత్రం ధ్వజావరోహణం జరగనుంది. మరోవైపు స్వామి వారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. వర్షం కారణంగా ఆలయంలో నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు భారీ మోటార్లతో నీటిని తోడిస్తున్నారు.