kuwait: భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ!
- 15 మంది భారతీయులకు ఉరిశిక్ష రద్దు
- 119 మందికి శిక్షా కాలం తగ్గింపు
- భారత్ విన్నపాన్ని మన్నించిన రాజు
- ఉపశమనం పొందిన వారిలో తెలుగు వారు కూడా
గల్ఫ్ దేశం కువైట్ లో షరియత్ చట్టాలు చాలా కఠినంగా అమలవుతాయి. మరణ శిక్షలు పడినవారికి క్షమాభిక్షలను ప్రసాదించడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయులకు మరణశిక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. వీరందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తూ, మరణశిక్షలను జీవితఖైదుగా మార్చారు. ఈ మేరకు కువైట్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మరో 119 మంది భారతీయ ఖైదీల శిక్షా కాలాన్ని కూడా తగ్గించారని ఆమె చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన విన్నపాన్ని దయతో అంగీకరించినందుకు కువైట్ రాజుకు సుష్మ ధన్యవాదాలు తెలిపారు.
స్మగ్లింగ్, హత్య నేరాల కింద శిక్షలు పడిన భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. కువైట్ రాజు ఉత్తర్వుల ప్రకారం జైలు నుంచి విడుదల కానున్న భారత ఖైదీల విషయంలో స్థానిక అధికారులకు అక్కడి భారత రాయబార కార్యాలయం సహకరిస్తుందని సుష్మ తెలిపారు.