Shatrughan Sinha: మోదీ మీడియా ముందుకు రావాలి... ప్రజలకు సమాధానం చెప్పాలి: వరుస ట్వీట్లతో హోరెత్తించిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా
- ప్రజల అనుమానాలకు సమాధానాలు చెప్పాలి
- సమస్యను దారి మళ్లించవద్దు
- అప్పుడప్పుడైనా మధ్యతరగతికి మేలు చేయాలి
- బీజేపీ/ఎన్డీయే చిరకాలం వర్ధిల్లాలి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోందంటూ కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలతో కలవరపాటుకు గురయ్యాయి. మరోవైపు విపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్టైంది.
ఇదే సమయంలో మరో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా చేసిన ట్వీట్లు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. యశ్వంత్ సిన్హా వ్యాఖ్యల నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం ప్రజలను ఎదుర్కోవాలని, వారి అనుమానాలకు సమాధానాలను చెప్పాలని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను తానే కాకుండా, ఎంతోమంది నేతలు కూడా సరైనవేనని భావిస్తున్నట్టు తెలిపారు.
రానున్న రోజుల్లో దేశ ఆర్థిక సమస్యలను వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు లేవనెత్తుతారని హెచ్చరించారు. ఈ వివాదాన్ని మరుగున పరిచేందుకు... ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, యశ్వంత్ సిన్హాల మధ్య చోటు చేసుకున్న వివాదంగా మార్చే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. ప్రధాని మోదీ మీడియా ముందుకు వచ్చి, ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలని సూచించారు.
ప్రధాని మోదీ అప్పుడప్పుడైనా దేశంలోని మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి వ్యాపారులు, చిరు వ్యాపారుల గురించి పట్టించుకుంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కనీసం గుజరాత్ లోనైనా ఈ మేరకు నడుచుకుంటారని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో హోరెత్తించారు. చివరగా... 'బీజేపీ/ఎన్డీయే చిరకాలం వర్ధిల్లు. జై బీహార్, జై మహారాష్ట్ర, జై గుజరాత్, జై హింద్' అంటూ ముగించారు.