world badminton rankings: ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్.... టాప్ 20లో ఐదుగురు భారతీయులు
- ఎనిమిదో స్థానంలో నిలిచిన కిడాంబి శ్రీకాంత్
- మహిళల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు
- మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీకి 17వ ర్యాంకు
బ్యాడ్మింటన్ ఆటలో భారత ఆటగాళ్లు పతకాలు తీసుకురావడమే కాకుండా ప్రపంచస్థాయి ర్యాంకింగ్స్‌లోనూ ముందంజలో నిలుస్తున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో ఐదుగురు భారత షట్లర్లు ర్యాంకులు సాధించారు. వీరిలో కిడాంబి శ్రీకాంత్ 8వ స్థానం, హెచ్ ఎస్ ప్రణయ్ 15వ స్థానం, సాయి ప్రణీత్ 17వ స్థానం, సమీర్ వర్మ 19వ స్థానం, అజయ్ జయరామ్ 20వ స్థానాల్లో నిలిచారు. వీరంతా పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులే. దీనికి సంబంధించి కిడాంబి శ్రీకాంత్ - `అధికారికంగా టాప్ 20 ర్యాంకింగ్స్‌లో ఐదుగురు భారతీయులకు స్థానం లభించింది. ఇది ఆరంభం మాత్రమే.. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది` అని ట్వీట్ చేశాడు.
ఇక మహిళల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. పీవీ సింధు 2వ ర్యాంకులో కొనసాగుతుండగా, సైనా 12వ స్థానంలో ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ జపాన్ ఓపెన్ సిరీస్‌లో ఓటమి పాలైనప్పటికీ వారి ర్యాంకుల మీద ఎలాంటి ప్రభావం పడలేదు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి - ప్రణవ్ చోప్రాల జోడి 17వ స్థానంలో నిలిచింది.