purandeswari: కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదు: పురందేశ్వరి విమర్శలు
- కేంద్ర నిధులకు ఏపీ ప్రభుత్వం లెక్కలు చూపడం లేదు
- లెక్కలు చూపితేనే నిధులు వస్తాయి
- రాజధాని విషయంలో కూడా ప్రభుత్వ తీరు సరిగా లేదు
ఏపీలో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలే అయినప్పటికీ ఇరు పార్టీల నేతల మధ్య మాత్రం విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నాయకురాలు పురందేశ్వరి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులకు ఏపీ ప్రభుత్వం సరైన లెక్కలు చూపించడం లేదంటూ ఆమె ఆరోపించారు.
కేంద్రం అందిస్తున్న నిధులకు లెక్కలు చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తే... ఆ నిధులు వెంటనే వస్తాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించారు. రాజధాని విషయంలో కూడా ప్రభుత్వ తీరు సరిగా లేదని అన్నారు.