trump: అమెరికా అధ్యక్షుడి దీపావళి విందు... ఒబామా సంప్రదాయాన్ని కొనసాగించనున్న ట్రంప్
- స్పష్టం చేసిన వైట్‌హౌస్
- విందులో వీసాల గురించి చర్చించే అవకాశం
- గతంలో ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని రద్దు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా భారత అమెరికన్లకు ప్రత్యేకంగా విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వస్తున్న తొలి దీపావళి సందర్భంగా పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద భారత అమెరికన్లకు ప్రత్యేక విందు ఇవ్వనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
ఈ విందులో భాగంగా భారతీయులకు వీసా సంబంధిత అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీసాల విషయంలో సానుకూలంగా స్పందించడమేగాక, గతంలో షికాగో ప్రదర్శనలో భారత అమెరికన్లు చేసిన విజ్ఞప్తులను కూడా ట్రంప్ పరిశీలించే అవకాశాలున్నాయని ట్రంప్ మద్దతుదారు, రిపబ్లికన్ హిందూ కూటమి వ్యవస్థాపకుడు షాలభ్ కుమార్ తెలిపారు.
కొన్ని దశాబ్దాల నుంచి రంజాన్ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఇస్తున్న ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో 2009లో ఒబామా ప్రారంభించిన దీపావళి విందు సంప్రదాయాన్ని ట్రంప్ కచ్చితంగా రద్దు చేస్తారని కొంతమంది భావించారు. అయితే ఇటీవల దీపావళి విందు వేడుకలు చేయడం గురించి రిపబ్లికన్ సెనేటర్ ఓరిన్ హాచ్ రాసిన లేఖకు వైట్‌హౌస్ సానుకూలంగా స్పందించడంతో భారతీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.