Dalit youth: మీసాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నాడని.. దళిత యువకుడిని చావబాదిన అగ్రవర్ణాల యువకులు!
- దళితులు అలా తీర్చిదిద్దుకోవడమేంటని ప్రశ్నిస్తూ దాడి
- పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
- అట్రాసిటీ కేసు నమోదు
మీసాన్ని అందంగా తీర్చి దిద్దుకున్న దళిత యువకుడిని చూసి జీర్ణించుకోలేని అగ్రవర్ణాలవారు అతడిని చావబాదారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కలోల్ తాలూకాలోని లింబోదర గ్రామానికి చెందిన పీయూష్ పర్మర్ (24) తన మీసాలను అందంగా కత్తిరించుకున్నాడు. దీనిని చూసి సహించలేని అదే గ్రామానికి చెందిన దర్బార్ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు యువకులు అతడిపై దాడిచేసి చితకబాదారు.
పీయూష్‌పై దాడిచేసిన యువకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న పీయూష్, తన కజిన్ దిగంత్ మహెరియాతో కలిసి వస్తుండగా అడ్డుకున్న యువకులు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తమను కొడుతూ ‘మీసాల్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు మీకు ఎంత ధైర్యం’ అని ప్రశ్నించారని బాధితుడు పీయూష్ తెలిపాడు. అట్టడుగు కులం నుంచి వచ్చిన మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ చావబాదారని పేర్కొన్నాడు.