bathukamma: తెలంగాణ పర్యాటక శాఖ ‘గిన్నిస్’ ప్రయత్నం విఫలం
- అధికారుల సమన్వయ లోపం
- సరిపడా మహిళలను సమీకరించడంలో విఫలం
- ముందస్తు రిహార్సల్స్ కూడా లేదు
- వరుణుడు కూడా అడ్డుకున్న వైనం
బతుకమ్మ పండుగనాడు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతి శాఖ ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నమైన తంగేడుపువ్వు ఆకారంలో ఎల్బీ స్టేడియం వేదికగా మూడు వేల మంది మహిళలతో బతుకమ్మలను పేర్చి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలని పర్యాటక శాఖ భావించింది. అయితే నిర్వహణ లోపంతోపాటు ప్రకృతి కూడా సహకరించకపోవడంతో ప్రయత్నం విఫలమైంది.
రిహార్సల్స్ లేకుండా మహిళలను తీసుకురావడం, సరిపడా సంఖ్యలో మహిళలను సమీకరించలేకపోవడం, సమన్వయ లోపం, వరుణుడు అడ్డు తగలడం తదితర కారణాలతో ప్రయత్నం సఫలం కాలేదు. గిన్నిస్ ప్రతినిధులు రెండు అవకాశాలు కల్పించినా ఫలితం లేకుండాపోయింది.
తొలుత స్టేడియంలో సున్నంతో మహా తంగేడు పువ్వు ఆకారాన్ని గీశారు. పసుపు, ఆకుపచ్చ, గునుగు పువ్వు రంగు చీరలు ధరించిన మూడు వేల మంది మహిళలు ఈ ఆకృతిపై నిలబడాల్సి ఉంది. అలాగే ఒకేసారి బతుకమ్మలను పేర్చే కార్యక్రమంలో భాగంగా కుడిఎడమల్లో 1500 సున్నపు గళ్లను 15 వరుసలతో ఏర్పాటు చేశారు. అందులో మూడువేల మంది మహిళలు బతుకమ్మలు పేర్చాల్సి ఉంది.
అయితే ఈ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు మహిళలను సమీకరించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వీరి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. నిజానికి ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకే ప్రారంభించాల్సి ఉండగా మహిళలు మైదానానికి చేరుకోవడం, ఇతర ఏర్పాట్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా పర్యాటక శాఖ గిన్నిస్ కల నెరవేరకుండా పోయింది.