hyderaba: పాతబస్తీ బాలిక రుక్సా కేసులో నయా ట్విస్ట్.. షేక్‌ను వదిలి వచ్చేది లేదని తెగేసి చెబుతున్న బాలిక
- షేక్ తనను బాగానే చూసుకుంటున్నాడన్న బాలిక
- 61 ఏళ్ల ఒమన్ షేక్‌తో వివాహం
- దౌత్యపరమైన చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు
ఒమన్ షేక్‌ను నిఖా చేసుకున్న పాతబస్తీకి చెందిన బాలిక రుక్సా కేసులో కొత్త ట్విస్ట్. ఆమె మైనర్ కావడంతో షేక్‌తో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని చెబుతున్న పోలీసులు బాలికను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, తాను మాత్రం తిరిగి హైదరాబాద్ వచ్చేది లేదని చెబుతోంది. షేక్ తనను బాగానే చూసుకుంటున్నాడని, ఎటువంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని పేర్కొంది. బాలిక రుక్సా వివాహం ఆమె తల్లిదండ్రుల సమక్షంలో జరిగినట్టు ఆధారాలు సంపాదించిన పోలీసులు వారిపైనా కేసులు నమోదుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రుక్సాను హైదరాబాద్ రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్కుంట ప్రాంతానికి చెందిన రుక్సాను ఒమన్‌కు చెందిన షేక్ అహ్మద్ అబ్దుల్లా అమూర్ అల్ రహ్బీ(61)కి ఇచ్చి మే 16న నిఖా జరిపించారు. పాతబస్తీకి చెందిన బ్రోకర్లు ఈ వివాహాన్ని ముందుండి జరిపించారు.
ఇందులో భాగంగా ఒప్పందం ప్రకారం షేక్ అహ్మద్ దళారులకు రూ.8 లక్షలు చెల్లించగా వారు పేదలైన రుక్సా తల్లిదండ్రులకు కూలర్, చిన్న మోపెడ్ కొనిపెట్టి, మిగతా డబ్బులు వాళ్లు కాజేశారు. వివాహమైన తర్వాత వారం పాటు రుక్సాతో కలిసి హోటల్లో ఉన్న షేక్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత స్వదేశానికి వెళ్లి ఆమె కోసం నకిలీ పత్రాలతో వీసా సంపాదించి పంపించాడు. దీంతో ఒమన్ వెళ్లిన బాలికపై షేక్, అతడి బంధువులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పి బాధపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల 17న వెలుగులోకి వచ్చిన రుక్సా ఉదంతం పెను సంచలనం సృష్టించింది.