duplicate astrologist: టీవీల్లో జాతకాలు చెప్పే స్వామి... బయట కామి!
- పదో తరగతి వరకు చదివిన వెంకటలక్ష్మీ నరసింహాచార్యులు అలియాస్ విష్ణు
- టీవీల్లో కనిపిస్తూ పేరుమోసిన జ్యోతిష్యుడినని ప్రచారం
- 'భవిష్య వాణి' పేరిట జ్యోతిష్యకార్యాలయం.. పలు చోట్ల శాఖలు
- హోమాల పేరుతో కామం తీర్చుకునే స్వామి
టీవీలలో జాతకాలు చెబుతూ, సమస్యలు తీర్చే స్వామిగా కనిపించి, బయట హోమాలు చేస్తానంటూ లైంగిక వల విసిరే నకిలీ స్వామీజీని హైదరాబాదు, వనస్థలిపురం, ఎస్టీవో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా గుడిమెట్లకు చెందిన వెంకట లక్ష్మీనరసింహాచార్యులు అలియాస్ విష్ణు (44) హైదరాబాదులోని బాలాపూర్ సమీపంలోని అయోధ్యనగర్ లో నివాసం ఉంటున్నాడు. కేవలం పదోతరగతి చదివిన విష్ణు జీవిత సూత్రాలు బాగా వంటబట్టించుకున్నాడు. జ్యోతిష్యంలో మెలకువలు నేర్చుకుని, మీర్ పేటలోని గాయత్రీనగర్ లో ‘భవిష్య వాణి’ పేరిట కార్యాలయం ప్రారంభించాడు.
పేరుమోసిన జ్యోతిష్యుడినని చెప్పుకుంటూ కొన్ని టీవీ ఛానెళ్లలో జ్యోతిష్య కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. దీంతో కావాల్సిన ప్రచారం లభించింది. దీంతో విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరుల్లో కొత్త కార్యాలయాలు తెరిచాడు. సమస్య ఏదైనా హోమం చేసి పరిష్కరిస్తానని ప్రచారం చేశాడు. అతని ప్రచార అర్భాటాలకు ఆకర్షితులైన వారు తమ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునేందుకు ఆయన వద్దకు రావడం మొదలు పెట్టారు. దీంతో అలా వచ్చిన వారికి నమ్మకం కలిగేలా మాట్లాడుతూ, వారి దగ్గర్నుంచి లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవాడు. పనిలోపనిగా బలహీన మనస్కులైన మహిళలను లోబరచుకునేవాడు.
అతనికి డబ్బులు ఇచ్చిన వారికి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తామిచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఒత్తిడి చేసేవారికి సినిమాల తరహాలో తాను సీబీఐ ఆఫీసర్ నని చెబుతూ నకిలీ గుర్తింపు కార్డు, డమ్మీ తుపాకీ చూపించి బెదిరింపులకు దిగేవాడు. దీంతో బాధితులు వనస్థలిపురం, సరూర్ నగర్, మీర్ పేట, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేశారు. ఐదు కేసులు నమోదు కావడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నకిలీ తుపాకీ, పూజ సామగ్రి, 2 ల్యాప్ ట్యాప్ లు, 2 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి వస్తువులు, 5 లక్షల రూపాయల నగదు, ఒక కారు, సీబీఐ అధికారి నకిలీ గుర్తింపుకార్డు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.