Website: మధురై ఆలయంలోని అర్ధనగ్న బాలికలపై కథనం ప్రచురించిన వెబ్‌సైట్‌కు బెదిరింపులు!

  • ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం
  • అర్ధ నగ్నంగా 15 రోజులు ఆలయంలో గడపాల్సిందే..
  • బాలికల ఎంపికకు ముందు పరేడ్

తమిళనాడులోని మధురై‌లోని ఓ ఆలయంలో పూజారి పర్యవేక్షణలో బాలికలను అర్ధ నగ్నంగా ఉంచే పురాతన ఆచారంపై కథనం ప్రచురించిన కోయంబత్తూరుకు చెందిన 'కోవై పోస్ట్' వెబ్‌సైట్ ఎడిటర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురై జిల్లాలోని వెల్లాలూర్ గ్రామంలోని ఓ ఆలయానికి చెందిన పూజారి 10 నుంచి 14 ఏళ్ల లోపున్న ఏడుగురు బాలికలను 15 రోజులపాటు ఆలయంలో అర్ధనగ్నంగా గడిపేందుకు ఎంపిక చేశారు.

ఈ బాలికలందరూ పైన దుస్తులు ధరించకూడదు. కేవలం ఆభరణాలతో మాత్రమే పై శరీరాన్ని కప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయంలో అర్ధనగ్నంగా ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కానీ, ఇతర వేధింపులు కానీ జరిగినట్టు ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు లేవు. ఇది ఆలయ సంప్రదాయంగా వస్తోంది. 62 గ్రామాలకు చెందిన బాలికలు యెజైకాథ అమ్మన్ ఆలయ పూజారి ఎదుట పరేడ్ నిర్వహించగా వారిలో ఏడుగురిని ఆయన ఎంపిక చేశారు.

ఇందుకు సంబంధించిన కథనాన్ని వెబ్‌సైట్ వీడియోతో సహా ప్రచురించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కథనం ప్రచురించిన తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు 'కోవై పోస్ట్' వెబ్‌సైట్ ఎడిటర్ విద్యశ్రీ ధర్మరాజ్ తెలిపారు.

Website
half-naked girls
Madurai temple
  • Loading...

More Telugu News